దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల్లో 6,33,867 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,528 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,04,005కి చేరింది. నిన్న 149 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,16,281కి చేరింది.
ఒక్క రోజులో 3,997 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,24,58,543కి చేరింది. ప్రస్తుతం దేశంలో 29,181 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.73 శాతానికి చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.40 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 15.7 లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 180.9 కోట్ల డోసులను పంపిణీ చేశారు.