దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 4,49,197 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,483 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,62,569కి చేరింది. నిన్న కరోనా కారణంగా 1,399 మంది ప్రాణాలు కోల్పోయారు. అస్సోం, కేరళ రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాలు మరణాల సంఖ్యను సవరించడంతో ఈ స్థాయిలో మరణాలు రేటు పెరిగింది.
దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,23,622కి చేరింది. ఒక్క రోజులో 1,970 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,25,23,311కి చేరింది. ప్రస్తుతం దేశంలో 15,636 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75 గా, రోజువారి పాజిటివిటీ రేటు 0.55గా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,87,95,76,423 డోసులను పంపిణీ చేశారు.