దేశంలో రోజు వారి కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు పెరిగింది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 6,61,954 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,938 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,14,687కి చేరింది. నిన్న 67 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,16,672కి చేరింది.
ఒక్క రోజులో 2,531మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,24,75,588కి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,427 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.75, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.29 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 182.23కోట్ల డోసులను పంపిణీ చేశారు.