దేశంలో కరోనా రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య భారీగా పెరిగింది . నిన్న దేశ వ్యాప్తంగా 4,25,337 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 18,313 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,39,38,764కి చేరింది. గత 24 గంటల్లో 57 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,26,167కి చేరింది.
నిన్న 20,742 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,32,67,571 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,45,026 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.47శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 4.31 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిన్న 27,37,235మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 202.79 కోట్ల డోసులను పంపిణీ చేశారు.