ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్.. మ‌హారాష్ట్ర‌లో పెరుగుతున్న కేసులు

India Reports 1542 new covid-19 cases.దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉండ‌గా.. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ XBB మాత్రం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Oct 2022 11:35 AM IST
ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్.. మ‌హారాష్ట్ర‌లో పెరుగుతున్న కేసులు

దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి అదుపులోనే ఉండ‌గా.. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ XBB మాత్రం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. BA.2.75, BQ 1 రకాలు కలిపి XBB సబ్‌ వేరియంట్‌గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు తెలిపారు. ఈ వేరియంట్‌ను ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడులో గుర్తించినట్లు చెప్పారు. ఈ ఆగస్టులోనే సింగపూర్‌, యూఏఈలో XBB సబ్‌ వేరియంట్‌ వెలుగులోకి వచ్చింది. దీనికి BA.2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మ‌హారాష్ట్రలో గ‌త వారంతో పోల్చుకుంటే కొత్త కేసులు 17.7 శాతం మేర పెరిగాయి. చలికాలం, పండగల సీజన్‌ ఉండటంతో ఈ వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 2,27,207 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేయ‌గా కొత్త‌గా 1,542 పాజిటివ్ కేసులు వ‌చ్చాయి. నిన్న 1,919 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న‌వారి సంఖ్య 4,40,77,068. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,28,913కి చేరింది.

ప్ర‌స్తుతం దేశంలో 26,449 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రిక‌వ‌రీ రేటు 98.75 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 0.68 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన‌సాగుతూనే ఉంది. నిన్న 4,23,087 మందికి టీకా ఇచ్చారు. మొత్తంగా ఇప్పటి వరకు 219.37 కోట్ల డోసులను పంపిణీ చేశారు.

Next Story