దేశంలో గత కొద్ది రోజులుగా అదుపులోనే ఉన్న కరోనా మహమ్మారి మరోసారి తన పంజా విసురుతోంది. క్రమంగా రోజువారి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. నిన్న దేశ వ్యాప్తంగా 4,84,924 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 13,216 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,83,793 కి చేరింది. నిన్నకరోనా కారణంగా 23 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,840 కి చేరింది.
నిన్న8,148 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,90,845కి చేరింది. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.63 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.73శాతంగా ఉంది. దేశం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 196 కోట్ల డోసులను పంపిణీ చేశారు.