దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 38.4 శాతం పెరిగింది. నిన్న దేశ వ్యాప్తంగా 5,19,419 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 12,213 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,32,57,730 కి చేరింది. నిన్నకరోనా కారణంగా 11 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,24,803 కి చేరింది.
నిన్న7,624 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,74,712కి చేరింది. ప్రస్తుతం దేశంలో 58,215 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.65 శాతంగా, రోజు వారి పాజిటివ్ రేటు 2.35 శాతంగా ఉంది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 195.67 కోట్ల డోసులను పంపిణీ చేశారు.