పుస్తకాల్లో ఇక 'ఇండియా' కాదు..'భారత్' అనే వాడాలి: NCERT
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 5:00 PM ISTపుస్తకాల్లో ఇక 'ఇండియా' కాదు..'భారత్' అనే వాడాలి: NCERT
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లో ఇండియా అనే పదానికి బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు ప్యానెల్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం.. ఇండియా అంటే భారత్ యూనియన్ అని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్యానెల్ నిర్వచించింది.
తాజాగా ఎన్‌సీఆర్‌టీ ప్యానెల్ ప్రతిపాదనను సభ్యులంతా ఆమోదించడంతో ఇకపై పుస్తకాల్లో ఇండియా అనే పేరు మాయం కానుంది. ప్యానెల్ చైర్మన్ ఐజాక్ మాట్లాడుతూ.. కొత్త పుస్తకాల్లో పేర్లు మార్చాలని గతంలోనే ప్రతిపాదన ఉందని తెలిపారు. కాగా.. తాజాగా ప్రతిపాదనకు ఆమోదం లభించిందని అమల్లోకి రానుందని వెల్లడించారు. ఎన్‌సీఈఆర్‌టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ వెల్లడించారు.
అంతేకాదు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉందనీ.. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదన్నారు. బ్రిటిష్ వారి మరకల్ని శాశ్వతంగా దూరం చేయడానికే పేర్లు మారుస్తున్నట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ తెలిపారు. ఇండియా పదాన్ని తొలగించడమే కాకుండా.. హిందూ ధర్మం సాధించిన విజయాలు హైలెట్ చేయాలని సిఫారసు చేయడం మరింత వివాదానికి దారి తీసింది.
కాగా.. ప్రతిపక్ష కూటమికి ఇండియా పేరు పెట్టినప్పటి నుంచి దేశంలో చాలా కార్యక్రమాలో ఆ పదం వాడటం లేదు. రాష్ట్రపతి జీ20 విందు ఆహ్వాన పత్రికల్లో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నారు. జీ 20 లీడర్స్ సమ్మిట్ లో ప్రధాని మోదీ ప్రసంగిస్తున్నప్పుడు టేబుల్ పై భారత్ నేమ్ ప్లేట్ ని ప్రదర్శించారు. ఇలా చాలా ప్రాంతాల్లో పేరు మార్పు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. కేంద్రం తీరుపై స్పందించిన కాంగ్రెస్.. తమ కూటమిని చూసి మోదీ భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక పుస్తకాల్లో సైతం పేర్లు మార్చడాన్ని కూడా ఇండియా కూటమి తప్పుబడుతోంది.