భారతదేశంలో వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూ ఉన్న సంగతి తెలిసిందే..! భారతదేశంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందాలంటే డిసెంబర్ వరకూ ఆగాలని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక భారతదేశంలో పలు కంపెనీలకు అనుమతులను ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇంకొన్ని కంపెనీలకు కూడా ప్రత్యేకంగా ఆర్డర్లను ఇవ్వాలని భారత ప్రభుత్వం అనుకున్నా కూడా ఆయా కంపెనీలకు ఇప్పటికే పలు దేశాలు ఆర్డర్లు ఇవ్వడంతో ఇక వేచి చూడాల్సిందేనట..!
అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా సంస్థలను కేంద్ర ప్రభుత్వం అడిగినా కూడా అక్కడి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఫైజర్, మోడెర్నా టీకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఏర్పడడంతో, భారత్ లో 2023 వరకు ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించడంలేదని చెబుతున్నారు. ఇప్పటికే బుక్ చేసుకున్న దేశాలకు టీకాలు సరఫరా చేసేందుకే ఫైజర్, మోడెర్నాలకు మరో రెండేళ్లు పట్టనుంది. ఫైజర్ సంస్థ తన టీకాకు అత్యవసర అనుమతుల కోసం గతంలోనే భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అయితే ఫైజర్ టీకా ఎం-ఆర్ఎన్ఏ కేటగిరీకి చెందినదంటూ నిపుణుల కమిటీ దాన్ని తిరస్కరించింది. దాంతో ఫైజర్ మరోసారి దరఖాస్తు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు భారత్ అడుగుతున్నా కూడా ఫైజర్ సంస్థ భారత్ కు అవకాశం ఇవ్వడం లేదు. ఈ వ్యాక్సిన్లు రావాలంటే 2023 వరకూ వేచి చూడాలి.