ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మొత్తం 628 పులులు మరణించాయి. చాలా వరకూ సహజ మరణాలు కాగా.. కొన్ని వేట, ఇతర కారణాల వల్ల మరణించాయి. అదే సమయంలో పులుల దాడిలో 349 మంది మరణించారు, ఒక్క మహారాష్ట్రలోనే 200 మరణాలు నమోదయ్యాయి.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ప్రకారం 2019లో 96, 2020లో 106, 2021లో 127, 2022లో 121, 2023లో 178 పులులు చనిపోయాయి. 2019, 2020 పులుల దాడిలో 49 మంది, 2021లో 59 మంది, 2022లో 110 మంది, 2023లో 82 మంది మరణించారని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో పులుల దాడిలో 59 మంది చనిపోగా, మధ్యప్రదేశ్‌లో 27 మంది మరణించారు.
భారతదేశంలో మొత్తం పులుల సంఖ్య 3,682 గా ఉంది. ప్రపంచంలోని పులుల జనాభాలో దాదాపు 75 శాతం భారత్ లోనే ఉన్నాయి. పులుల సంరక్షణను ప్రోత్సహించడానికి భారతదేశం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించింది. మొదట 18,278 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో తొమ్మిది టైగర్ రిజర్వ్‌లను కవర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో 78,735 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా 55 టైగర్ రిజర్వ్ లు ఉన్నాయి.