భారత్ ఇప్పటికే హిందూ దేశం.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
భారతదేశం ఇప్పటికే హిందూ దేశమేనని, దానికి రాజ్యాంగ అనుమతి అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
By - అంజి |
భారత్ ఇప్పటికే హిందూ దేశం.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్
భారతదేశం ఇప్పటికే హిందూ దేశమేనని, దానికి రాజ్యాంగ అనుమతి అవసరం లేదని ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఇది ఒక సత్యమని, చట్టపరమైన ముద్ర అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన ఒక సదస్సులో ప్రసంగించిన మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని, పూర్వీకుల గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఉన్నంతకాలం భారత్ హిందూ దేశంగానే కొనసాగుతుందని అన్నారు. ''సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. దానికి రాజ్యాంగ ఆమోదం అవసరమా? అదే విధంగా హిందుస్తాన్ ఒక హిందూ దేశం. భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావిస్తూ, భారతీయ సంస్కృతిని గౌరవించే వారు ఈ నేలపై ఒక్కరు ఉన్నా భారత్ హిందూ దేశమే'' అని ఆయన వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించి 'హిందూ దేశం' అనే పదాన్ని చేర్చినా లేదా చేర్చకపోయినా తమకు ఎలాంటి పట్టింపు లేదని మోహన్ భాగవత్ తెలిపారు.
''ఆ పదాన్ని రాజ్యాంగంలో చేర్చినా, చేర్చకపోయినా మాకు తేడా లేదు. మేము హిందువులం, మా దేశం హిందూ దేశమే. అదే నిజం. జన్మ ఆధారిత కులవ్యవస్థ హిందుత్వ లక్షణం కాదు'' అని ఆయన స్పష్టం చేశారు. అల్పసంఖ్యాకుల అంశంపై స్పందించిన మోహన్ భాగవత్, ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటికీ ముస్లింలకు వ్యతిరేక సంస్థ కాదని తెలిపారు. ''మేము ముస్లింలకు వ్యతిరేకమనే భావన ఎవరికైనా ఉంటే, మా కార్యకలాపాలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఎవరైనా వచ్చి చూడవచ్చు. అలాంటి దృక్కోణం మీకు నిజంగా కనిపిస్తే మీ అభిప్రాయం కొనసాగించండి. కనిపించకపోతే అభిప్రాయం మార్చుకోండి. ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది. కానీ అర్థం చేసుకోవాలనే మనసు లేకపోతే ఎవరూ మార్చలేరు'' అని ఆయన అన్నారు.