పాంగాంగ్‌పై చైనా మరో వంతెన.. స్పందించిన భారత్
India doubles down on opposition to China’s second bridge across Pangong Lake.గత రెండేళ్లుగా తూర్పు లఢక్‌లో
By తోట వంశీ కుమార్ Published on 21 May 2022 11:31 AM ISTగత రెండేళ్లుగా తూర్పు లఢక్‌లో భారత్, చైనా ల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తూర్పు లఢక్‌లో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెనను నిర్మిస్తోంది. వాస్తవాధీన రేఖకు అటువైపున 20 కిలోమీటర్ల దూరంలో ఈ వంతెనను నిర్మిస్తోంది. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్నరెండో వంతెన ఇది. ఇటీవలే చైనా ఓ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ వంతెన నిర్మాణం వెలుగులోకి వచ్చింది.
ఇక.. సరిహద్దుల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కేంద్రం ఏం చేస్తోందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆక్రమించుకున్న భూభాగంలో చైనా నిర్మాణాలు చేపడుతోందని, ఇలాంటి అక్రమ నిర్మాణాలను భారత్ ఏమాత్రం సహించబోదని స్పష్టం చేసింది. చైనా చేసే అర్ధరహితమైన ఆరోపణలను తాము అంగీకరించబోమని తెలిపింది.
పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని, దేశ భద్రతకు భంగం వాటిల్లే పరిస్థితులను ఉపేక్షించేదే లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరిందమ్ బాగ్జి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు లఢక్ లోని భారత భూభాగాన్నికాపాడుకుంటామని చెప్పారు.
ఇదిలాఉంటే.. లఢక్‌లో బలగాలను ఉపసంహరించుకోవాలని చైనా ఓ ప్రతిపాదనను ముందు పెట్టింది. అయితే.. బలగాల ఉపసంహరణపై చైనా తగ్గినట్లే తగ్గి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.