వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ రికార్డు.. 100 కోట్ల డోసుల పంపిణీ

India crosses 1 Billion Vaccinations Milestone.క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అన్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Oct 2021 10:41 AM IST
వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ రికార్డు.. 100 కోట్ల డోసుల పంపిణీ

క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అన్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ స‌రికొత్త మైలురాయిని అందుకుంది. టీకా పంపిణీలో నేడు 100 కోట్ల మైలురాయిని అధిగ‌మించిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. చైనా త‌రువాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భార‌త్ రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలో జ‌న‌వ‌రి 16న టీకా పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభం అయ్యింది. తొలి ద‌శ‌లో ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌గా ఉన్న వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ ఇచ్చారు.

రెండో ద‌శ‌ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభ‌మైంది. ఈ దశలో 45 ఏళ్లు నిండిన వారికి టీకాలు వేశారు. అనంతరం మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ టీకాలు వేస్తున్నారు. టీకా పంపిణీ ప్రారంభ‌మైన తొలి రోజుల్లో దీనిపై ఉన్న అపోహ కార‌ణంగా టీకా పంపిణీ చాలా నెమ్మ‌దిగా సాగింది. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించిన త‌రువాత వ్యాక్సినేష‌న్ ఊపందుకుంది. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా 2.50 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందించారు. నేటితో (అక్టోబ‌ర్‌)21తో వ్యాక్సినేష‌న్ 100 కోట్ల డోసుల మార్క్‌ను దాటింది. ఇందులో తొలి డోసు తీసుకున్న వారే అధికంగా ఉన్నారు. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం దేశ వ్యాప్తంగా అర్హులైన వారిలో 75 శాతం మందికి తొలి డోసు పూర్తి అవ్వ‌గా.. 31శాతం మందికి రెండో డోసు తీసుకున్నారు. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌డంతో.. దీనిపై దృష్టి సారించాల‌ని ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు కేంద్రం ఆదేశించింది.

వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ మైలురాళ్లు..

వ్యాక్సినేష‌న్ ప్రారంభం - జ‌న‌వ‌రి 16

కోటి డోసులు - ఫిబ్ర‌వ‌రి 19

10 కోట్ల డోసులు - ఏప్రిల్ 11

25 కోట్ల డోసులు - జూన్ 12

50 కోట్ల డోసులు - ఆగ‌స్టు 6

75 కోట్ల డోసులు - సెప్టెంబ‌ర్ 13

100 కోట్ల డోసులు - అక్టోబ‌ర్ 21

Next Story