దేశంలో కరోనా ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. అయితే.. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 16,49,143 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 2,38,018 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,76,18,271కి చేరింది. నిన్న 310 ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,86,761కి చేరింది.
ఒక్క రోజులో 1,57,421 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3,53,94,882కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 94.09శాతంగా ఉంది. ఇక పాజిటివిటీ రేటు కూడా 19.65 శాతం నుంచి 14.43 శాతానికి తగ్గింది. ఇక మంగళవారం ఉదయం వరకు దేశ వ్యాప్తంగా 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న 79.91 లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటి వరకు 158.04 కోట్ల డోసులను పంపిణీ చేశారు.