భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,38,699 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 11,106 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,89,623కి చేరింది. నిన్న ఒక్క రోజే 459 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,65,082కి చేరింది.
నిన్న 12,789 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,38,97,921కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,26,620 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.28 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 72.9లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 115కోట్ల పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. తాజాగా నమోదైన మొత్తం కేసులో సగం కంటే ఎక్కువగా అంటే 6,111 కేసులు ఒక్క కేరళలోనే నమోదు కావడం గమనార్హం.