భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 10 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

India Corona update on January 9th.భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2022 5:00 AM GMT
భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం.. 10 శాతానికి పెరిగిన పాజిటివిటీ రేటు

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. గ‌త కొద్ది రోజులుగా రోజువారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న 1.60ల‌క్ష‌ల కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్లుకేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఇక పాజిటివిటీ రేటు కూడా 10.21శాతానికి చేర‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిన్న దేశవ్యాప్తంగా 15,63,566 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 1,59,632 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ ఆదివారం ఉద‌యం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,28,004 కి చేరింది. నిన్న ఒక్క రోజే 327 మంది మృతి చెందారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన‌ వారి సంఖ్య 4,83,790కి చేరింది.

నిన్న 40,863 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,44,53,603కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 5,90,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. ఆదివారం ఉద‌యానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 3,623కి చేరింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 1009 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌గా.. ఆ త‌రువాత ఢిల్లీలో 513, కర్ణాటకలో 441, రాజస్థాన్‌లో 373 కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 1,409 మంది కోలుకున్నారు. నిన్న 89,28,316 మందికి టీకా వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా 151.58 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

Next Story