భారత్‌లో కరోనా మహమ్మారి తన పంజా విసురుతోంది. రోజు వారి కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య 56 శాతం అధికంగా నమోదు అయ్యాయి. ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. నేటి ఉదయానికి ఆ వేరియంట్ కేసుల సంఖ్య 2,630 కి చేరింది.
నిన్న దేశవ్యాప్తంగా 14,13,030 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 90,928 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,51,09,286కి చేరింది. నిన్న ఒక్క రోజే 325 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,82,876కి చేరింది. నిన్న 19,206 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,43,41,009కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,85,401 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. గురువారం ఉదయానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 2,630కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 797 కేసులు నమోదు కాగా.. ఆ తరువాత ఢిల్లీలో 465 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 995 మంది కోలుకున్నారు. నిన్న 91లక్షల మందికి టీకా వేశారు. దేశ వ్యాప్తంగా 148.67 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.