దేశంలో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. 22వేలు దాటిన కేసులు

India corona update on January 1st.దేశంలో రోజువారి క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఇక క‌రోనా కొత్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jan 2022 10:22 AM IST
దేశంలో మ‌ళ్లీ విజృంభిస్తున్న క‌రోనా.. 22వేలు దాటిన కేసులు

దేశంలో రోజువారి క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఇక క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో దేశ వ్యాప్తంగా 22వేల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య సైతం 1400 దాటింది.

నిన్న‌ దేశ వ్యాప్తంగా 11,10,855 క‌రోనా శాంపిళ్ల‌ను ప‌రీక్షించ‌గా.. 22,775 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,48,61,579కి చేరింది. నిన్న ఒక్క రోజే 406 మంది మ‌ర‌ణించారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన‌ వారి సంఖ్య 4,81,486కి చేరింది. నిన్న 8,949 మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌ను జ‌యించిన వారి సంఖ్య 3,42,75,312కి చేరింది. ప్ర‌స్తుతం దేశంలో 1,04,781 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.32 శాతంగా ఉంది.

ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శ‌ర‌వేగంగా వ్యాప్తిస్తోంది. ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1431కి చేరింది. అత్య‌ధికంగా మ‌హారాష్ట్రలో 454 కేసులు నమోదు కాగా.. ఆ త‌రువాత ఢిల్లీలో 351 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక కేర‌ళ‌, త‌మిళ‌నాడు, గుజ‌రాత్ రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 100 దాటింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23 రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు ఒమిక్రాన్ వ్యాపించింది. మొత్తం బాధితుల్లో 488 మంది కోలుకున్నారు.

ఇక దేశంలో 2021 జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. నిన్న మందికి 58.11 టీకాలు వేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 145.16 కోట్ల‌కు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 67.89 ​కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

Next Story