దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. రోజు వారి కేసుల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువైంది. నిన్న దేశవ్యాప్తంగా 18,86,935 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 2,47,417 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,63,17,927కి చేరింది. నిన్న ఒక్క రోజే 380 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 4,85,035కి చేరింది. ఒక్క రోజులో 84,825 మంది కోలుకున్నారు.
ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,47,15,361కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా వ్యాప్తిస్తోంది. గురువారం ఉదయానికి ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 5,488కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1,367మంది ఈ మహమ్మారి బారిన పడగా.. ఆ తరువాత రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549, కేరళలో 486, కర్ణాటకలో 479 మంది దీని బారిన పడ్డారు. ఇప్పటి వరకు 2,162 మంది కోలుకున్నారు. నిన్న 76లక్షల మందికి టీకా వేశారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 154.61 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.