దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,98,611 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 9,765 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. నిన్న ఒక్క రోజే 477 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,69,724కి చేరింది. నిన్న8,548 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,40,37,054కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 99,763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.35 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 80,35,261 మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 1,24,96,19,515 పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.