దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల్లో 12,50,672 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 7,992 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శనివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,82,736కి చేరింది. నిన్న ఒక్క రోజే 398 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,75,128కి చేరింది.
నిన్న9,265 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,41,14,331కి చేరింది. ప్రస్తుతం దేశంలో 93,277 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 76 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను వేశారు. ఇప్పటి వరకు 131.99 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. ఇక ఇప్పటి వరకు దేశంలో 65.46 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేశారు.