భారత్‌లో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి.. ఒకేరోజు 196 జేఎన్-1 కేసులు

తాజాగా దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 Jan 2024 6:20 AM GMT
india, corona, jn-1, central govt, health department ,

భారత్‌లో పెరుగుతోన్న కరోనా వ్యాప్తి.. ఒకేరోజు 196 జేఎన్-1 కేసులు 

గత కొన్నాళ్లుగా కరోనా వైరస్‌ మానవాళిని పట్టిపీడిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పలు దేశాల ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతేకాదు.. కొన్ని దేశాలు అయితే ఇప్పటికీ కరోనా దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాయి. అయితే.. కొన్నాళ్ల నుంచి కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. కానీ.. వివిధ వేరియంట్ల రూపంలో జనాల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 500కి పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.

తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో చనిపోయినవారి సంఖ్య 5,33,366కి పెరిగింది. కాగా.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,76,550గా ఉంది.

మరోవైపు దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్‌-1 రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రకం వేరియంట్‌ వ్యాప్తి దేశంలో వేగంగా ఉందనీ.. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక సోమవారం కూడా దేశంలో 196 జేఎన్‌-1 రకం కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలో 83, గోవా (51), గుజరాత్‌ (34), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్‌ (5), తమిళనాడు (4), తెలంగాణ (2), ఒడిశా (1), ఢిల్లీ (1) ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని.. ఇక కరోనా వ్యాప్తి ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనీ వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.

Next Story