దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,842 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,94,529 చేరింది. నిన్న ఒక్క రోజే 244 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 4,48,817కి చేరింది.
నిన్న 25,930 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 3,30,94,529 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,70,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 199 రోజుల కనిష్టానికి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ రికవరీ రేటు 97.87 శాతానికి చేరింది. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 90,51,75,348 కోట్ల డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు.
దేశంలో నమోదైన కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదు అయ్యాయి. నిన్న ఆరాష్ట్రంలో 13,217 కేసులు నమోదు కాగా.. 121 మంది మరణించారు.