దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,85,848 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 10,126 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి నుంచి నమోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్యల్ప సంఖ్య. 266 రోజుల తర్వాత అతి తక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,43,77,114కి చేరింది. నిన్న ఒక్క రోజే 332 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,61,389కి చేరింది.
నిన్న 11,982 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,37,75,086కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,40,638 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.25 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 59,08,440 మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 1,09,08,16,356 డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.