దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసు సంఖ్య 14 శాతం మేర పెరిగింది. గడిచిన 24 గంటల్లో 11,89,470 మంది కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 13,091 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,671కి చేరింది. నిన్న ఒక్క రోజే 340 మంది మరణించారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,62,189కి చేరింది.
నిన్న 13,878 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,38,00,925కి చేరింది. ప్రస్తుతం దేశంలో 1,38,556 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.25 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 57.54 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 110కోట్ల డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.