స్వతంత్ర భారతదేశపు తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి క‌న్నుమూత‌

Independent India’s first voter Shyam Saran Negi dies. స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి కన్నుమూశారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 5:16 AM GMT
స్వతంత్ర భారతదేశపు తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి క‌న్నుమూత‌

స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి 106 ఏళ్ల వయసులో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. నేగి హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ నివాసి, గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఈ రోజు తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, ఆయనకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు బ్యాండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. కాగా.. నేగి మూడు రోజుల క్రితం(న‌వంబ‌ర్ 2న‌) రాబోయే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం పోస్టల్ ద్వారా త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నాడు.

జూలై 1, 1917న జన్మించిన నేగి కల్పాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశాడు. 1947లో బ్రిటీష్ పాలన ముగిసిన తర్వాత 1951లో భారతదేశం తన మొదటి సాధారణ ఎన్నికలను నిర్వ‌హించింది. నిజానికి తొలి సార్వ‌త్రిక ఎన్నిక‌లు చాలా ద‌శ‌లు 1952 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగినప్ప‌టికి హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో మాత్రం వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల దృష్ట్యా ఐదు నెల‌ల ముందుగానే నిర్వ‌హించారు. దీంతో అక్టోబ‌ర్ 25న నేగి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కాగా.. ఎన్నిక‌ల్లో తొలి ఓటు వేసిన వ్య‌క్తి ఆయ‌నే కావ‌డం విశేషం.

అప్ప‌టి నుంచి నేగి క్ర‌మం త‌ప్ప‌కుండా త‌న హ‌క్కును వినియోగించుకుంటున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ 12న జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర‌ప్ర‌భుత్వం వృద్ధుల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌గా.. నేగి పోస్ట‌ల్ బ్యాలెట్ ద్వారా న‌వంబ‌ర్ 2న త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటు వేయ‌డం ఇది 34వ సారి.

Next Story