Independence Day: ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

By అంజి  Published on  15 Aug 2023 2:52 AM GMT
Independence Day,Red Fort,Prime Minister Modi, national flag

Independence Day: ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను మోదీ ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ చిత్రపటానికి ప్రధాని పూలమాలలు వేసి నివాళులర్పించారు.

140 కోట్ల భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పారు. బాపూజీ చూపిన అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించామన్నారు. స్వాతంత్య్ర సమరంలో అసువులుబాసిన మహానుభావులకు నమస్సుమాంజలులు పలుకుతున్నాని తెలిపారు. ఈ సంవత్సరం అరవిందుడు, దయానంద సరస్వతి 150వ జయంతిని నిర్వహిస్తున్నట్టు ప్రధాని తెలిపారు. రాణి దుర్గావతి, మహాభక్తురాలు మీరాబాయిని స్మరించుకోవాల్సిన తరుణం ఇది అన్నారు. కొన్ని రోజుల కిందట మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరమని ప్రధాని మోదీ అన్నారు.

కొద్దిరోజులుగా అక్కడ శాంతి నెలకొంటున్నదని, మణిపూర్‌కు యావజ్జాతి అండగా నిలుస్తున్నదని చెప్పారు. మణిపూర్‌లో నూరు శాతం శాంతి సాధించాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామని చెప్పారు. సంపూర్ణ శాంతి సంకల్పంతో చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు. ఎర్రకోట దగ్గర జరుగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని జెండా ఎగురవేసిన అనంతరం ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ పూలవర్షం కురిపించారు. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేడయం ఇది పదోసారి.

Next Story