శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు.. 'ప్రేమ లేఖ అందిందంటూ'
Income Tax Department issues notice to NCP Chief Sharad Pawar.మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసింది. అనూహ్యమైన
By తోట వంశీ కుమార్ Published on 1 July 2022 11:34 AM ISTమహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసింది. అనూహ్యమైన మార్పులు, పలు నాటకీయ పరిణామాల మధ్య శివసేన రెబల్ నాయకుడు ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్‌కు ఆదాయపు పన్నుశాఖ షాకిచ్చింది. నిన్న రాత్రి తనకు ఆదాయపు విభాగం నుంచి నోటీసులు వచ్చినట్లు శరద్ పవార్ తెలిపారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో పొందుపరిచిన ఆస్తులు, ఆదాయంపై ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
'ఆదాయపు పన్ను శాఖ నోటీసుల విషయమై నాకు ప్రేమ లేఖ అందింది. 2004, 2009, 2014, 2020 ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లకు సంబంధించిన 'ప్రేమలేఖ' అని' చమత్కరిస్తూ శరద్ పవార్ ట్వీట్ చేశారు. అయితే.. ఇందులో ఆందోన చెందాల్సిన పని లేదన్నారు. అందుకు సంబంధించిన సమాచారం అంతా తన వద్ద ఉందన్నారు. ఇంకా నోటీసుకు సంబంధించిన ఇతర వివరాలు ఏమీ ఆయన చెప్పలేదు.
కాగా.. దీనిపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపస్ నోటీసులపై అభ్యంతరం వ్యక్తం చేశారు.' మహారాష్ట్రలో ప్రభుత్వం మారగానే మా అధినేతకు నోటిసులు వచ్చాయి. ఇది యాదృచ్చికంగా జరిగిందా..? లేదా దీని వెనుక ఇంకా ఏమైనా ఉందా..?' అనే అనుమానం వ్యక్తం చేశారు.
సొంత పార్టీ నేతలే తిరుబాటు చేయడంతో కలత చెందిన ఉద్దవ్ థాక్రే రెండు సార్లు రాజీనామా చేయాలని అనుకున్నారని, ఆ సమయంలో ఉద్దవ్ థాక్రే కు శరద్ పవార్ ధైర్యం చెప్పారని, ఆయనకు హితబోధ చేశారంటూ పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉద్దవ్ రాజీనామా చేయడం ఏక్‌నాథ్ షిండే సీఎంగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే శరద్ పవార్‌కు ఐటీ నోటీసులు రావడంపై ప్రస్తుతం ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.