ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు.. అదే ఫస్ట్ స్టేట్ కూడా..!
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.
By Knakam Karthik Published on 27 Jan 2025 10:43 AM IST
ఉత్తరాఖండ్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు..అలా చేసిన ఫస్ట్ స్టేట్‌గా రికార్డ్
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో 2025 జనవరి 27వ తేదీ సోమవారం నుంచి యూసీసీ అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. దీంతో భారతదేశంలోనే యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.
యూసీసీ ముసాయిదా రూపకల్పనకు ఉత్తరాఖండ్ సర్కారు పెద్ద కసరత్తు చేసింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన్ ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. అది యేడాదిన్నర పాటు కసరత్తు చేసి సమగ్రమైన యూపీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు. 2004 ఫిబ్రవరి 2న యూసీసీ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది.
చట్టం అమలుపై సంబంధిత అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందన్నారు. పౌరులందరికీ సమానైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తామని ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని ఈ ఏడాది జనవరి పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. కాగా, పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.
యూసీసీలోని నిబంధనలేంటి?
* ఉత్తరాఖండ్‌లో నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
* వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
* వివాహ నమోదు తప్పనిసరి.
* సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
* సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
* భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది.
* సహజీవనం చేస్తున్న, చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలి.
* చట్టాన్ని అతిక్రమిస్తే 6 నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తారు.
* 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు.
* తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే.. వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు.
* సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చినా.. వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు.
* సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాలి.
* అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధించారు.
* హలాల్ విధానంపై నిషేధం విధించారు