సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉదయ్ లలిత్ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు సాధారణ కోర్టు సమయాల కంటే గంట ముందుగా కేసుల విచారణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ కేసును విచారిస్తున్నప్పుడు ఉదయ్ లలిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జస్టిస్ ఉదయ్ లలిత్ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీతో మాట్లాడుతూ.. 'పిల్లలు ఉదయం 7 గంటలకే పాఠశాలకు వెళ్తున్నప్పుడు, మనం ఉదయం 9 గంటల నుండి ఎందుకు పని ప్రారంభించలేం' అని వ్యాఖ్యానించారు.
ఆగస్టు 26న ఎన్వీ రమణ పదవీ విరమణ చేసిన తర్వాత జస్టిస్ లలిత్ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సాధారణంగా సుప్రీంకోర్టులో విచారణలు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతాయి. వారంలో ఐదు రోజుల పాటే కోర్టులు పని చేస్తాయి. న్యాయమూర్తులు మధ్యాహ్నం కాసేపు విరామం తీసుకుంటారు. రోస్టర్‌పై కేసులు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి పనిని పునఃప్రారంభిస్తారు.
ఇలా ముందుగా కార్యకలాపాలు ప్రారంభించడంపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సంతోషం వ్యక్తం చేశారు.
జస్టిస్ లలిత్ ఇంకా మాట్లాడుతూ.. ''ఉదయం 9.30 గంటలకే కోర్టు విచారణలను ప్రారంభించడం సరైన సమయం. లాంగ్ హియరింగ్స్ లేనప్పుడు ఉదయం 9 గంటలకు పని ప్రారంభించి, 11.30 తర్వాత అరగంట విరామం తీసుకోవాలి. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పని ముగించుకోవచ్చ. దీని వల్ల సాయంత్రం ఎన్నో పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది'' అని అన్నారు.