కేజ్రీవాల్‌ను మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేయకపోతే ఢిల్లీలో కూడా అదే జ‌రుగుతుంది : అతిషి

దేశ రాజధాని ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే ఖరీదైన విద్యుత్, సుదీర్ఘ విద్యుత్ కోతలను చూస్తారని ఆప్ నాయకురాలు, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి శుక్రవారం అన్నారు

By Medi Samrat  Published on  20 Sept 2024 4:26 PM IST
కేజ్రీవాల్‌ను మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేయకపోతే ఢిల్లీలో కూడా అదే జ‌రుగుతుంది : అతిషి

ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రిని చేయకపోతే.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మాదిరిగానే ఖరీదైన విద్యుత్, సుదీర్ఘ విద్యుత్ కోతలను చూస్తారని ఆప్ నాయకురాలు, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి శుక్రవారం అన్నారు. అతిషి మాట్లాడుతూ.. “ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం 5 కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్ ధరను 118% పెంచి 1 కిలోవాట్ కనెక్షన్‌కు రూ. 17,365కి పెంచిందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ఈ వేసవి కాలంలో 8 గంటల కరెంటు కోత విధించింది. ఏ మారుమూల గ్రామంలోనూ కాదు.. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో ఈ 8 గంటల పవర్ కట్ చేశార‌ని.. కాబట్టి బీజేపీ మోడల్ విద్యుత్తు ఎందుకు.? ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌ను మళ్లీ గెలిపించి ఢిల్లీకి ముఖ్యమంత్రిని చేయడం చాలా ముఖ్యం అన్నారు. లేకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఈ రోజు మనం చూస్తున్న ఖరీదైన విద్యుత్, సుదీర్ఘ విద్యుత్ కోతలు, ఢిల్లీలో కూడా చూస్తాము కూడా చూస్తారని పేర్కొన్నారు.

కాగా.. గురువారం కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి నేతృత్వంలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. కేజ్రీవాల్ కేబినెట్‌లోని నలుగురు మంత్రులు - సౌరభ్ భరద్వాజ్, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ మంత్రులుగా కొనసాగుతారు. అయితే వారు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుల్తాన్‌పూర్ మజ్రా ఎమ్మెల్యే ముఖేష్ అహ్లావత్ మంత్రివర్గంలో చేరనున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన అహ్లావత్‌కు మంత్రి పదవి దక్కనుంది. ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. సీఎం అతిషితో సహా మొత్తం మంత్రివర్గం సెప్టెంబర్ 21 శనివారం ప్రమాణస్వీకారం చేయనుంది.

ఇదిలావుంటే.. అరవింద్ కేజ్రీవాల్ సెప్టెంబర్ 22న జంతర్ మంతర్ వద్ద 'జనతా కీ అదాలత్'లో ప్రసంగించనున్నారు. అయితే, ఆప్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతోందని బిజెపి ఆరోపించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశ రాజధాని ప్రజలు ప్రభుత్వంపై తమ నిరాకరణను వ్యక్తం చేశారని పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. ఆప్-కాంగ్రెస్ కూటమి ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

Next Story