ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్..కశ్మీర్‌లో రూ.16 కోట్లు హాంఫట్!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఒక భారీ 'ఛారిటీ స్కామ్' వెలుగులోకి వచ్చింది.
By - Knakam Karthik |
ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్..కశ్మీర్‌లో రూ.16 కోట్లు హాంఫట్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఒక భారీ 'ఛారిటీ స్కామ్' వెలుగులోకి వచ్చింది. యుద్ధ బాధితులకు సహాయం అనే నెపంతో అమాయక ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌లో ఈ మోసాలు పరాకాష్టకు చేరాయని, ఇప్పటివరకు కేవలం కాశ్మీర్‌లోనే సుమారు రూ. 16 కోట్ల మేర నిధులు వసూలు చేసినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. ఈ నిధులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మరియు వేర్పాటువాద ఉద్యమాలను తిరిగి పుంజుకునేలా చేయడానికి వాడే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ముఠాల పనితీరు చాలా వ్యూహాత్మకంగా సాగుతోంది. యుద్ధానికి సంబంధించిన బీభత్సమైన ఫోటోలు, వీడియోలను (అందులో చాలా వరకు ఫేక్ లేదా ఎడిట్ చేసినవి) చూపిస్తూ ప్రజలను భావోద్వేగాలకు గురిచేస్తున్నారు. వీరి ప్రధాన లక్ష్యం షియా ముస్లిం వర్గమేనని, ఇరాన్ పట్ల ఉన్న మతపరమైన అనుబంధాన్ని ఆసరాగా చేసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేకరిస్తున్నారని దర్యాప్తులో తేలింది. ప్రజలు తమ కష్టార్జితమైన సొమ్మునే కాకుండా, బంగారం, వెండి ఆభరణాలు, చివరికి ఇంటిలోని రాగి పాత్రలను కూడా విరాళంగా ఇచ్చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
డిజిటల్ ట్రాకింగ్‌కు చిక్కకూడదనే ఉద్దేశంతో ఈ మోసగాళ్లు ఆన్‌లైన్ పేమెంట్లను కాకుండా, ఇంటింటికీ వెళ్లి నేరుగా నగదు వసూలు చేసే 'ఆఫ్‌లైన్' పద్ధతినే ఎంచుకున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు ముందు వేర్పాటువాద గ్రూపుల కోసం నిధులు సేకరించిన పాత నెట్‌వర్కే ఇప్పుడు 'ఇరాన్ యుద్ధ బాధితుల సహాయం' పేరుతో రంగంలోకి దిగినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నిధులు ఇచ్చిన వారిలో చాలా మంది ఎటువంటి రసీదులు లేదా జవాబుదారీతనం కోరకపోవడం ఈ ముఠాలకు వరంగా మారింది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తెలియని వ్యక్తులకు, అపరిచిత సంస్థలకు యుద్ధం పేరుతో విరాళాలు ఇచ్చి మోసపోవద్దని, ఇటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. యుద్ధం సాకుతో సేకరిస్తున్న ఈ సొమ్ము చివరకు దేశ భద్రతకే ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.