భార్య మానసిక క్రూరత్వం కారణంగా విడాకులు తీసుకునే హక్కు భర్తకు ఉంది: హైకోర్టు
భర్తను పిరికివాడిగా, నిరుద్యోగిగా అభివర్ణిస్తూ, అతడిని తల్లిదండ్రుల నుంచి విడిపోవాలని బలవంతం చేస్తూ..
By అంజి Published on 9 April 2023 3:00 AM GMTభార్య మానసిక క్రూరత్వం కారణంగా విడాకులు తీసుకునే హక్కు భర్తకు ఉంది: హైకోర్టు
భర్తను పిరికివాడిగా, నిరుద్యోగిగా అభివర్ణిస్తూ, అతడిని తల్లిదండ్రుల నుంచి విడిపోవాలని బలవంతం చేస్తూ.. భార్య నిరంతరం వేధింపులకు గురిచేస్తుంటే మానసిక క్రూరత్వంతో భార్య నుంచి విడాకులు తీసుకునే హక్కు భర్తకు ఉందని కింది కోర్టు ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. తన భర్తపై మానసిక క్రూరత్వానికి పాల్పడిన కారణంగా తన వివాహాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేసిన మహిళకు సంబంధించిన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు విచారించింది.
జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ ఉదయ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. భారతీయ సంస్కృతి ప్రకారం భర్త తల్లిదండ్రుల వద్దే ఉంటాడని పేర్కొంది. కొడుకు విడిగా జీవించడానికి న్యాయమైన కారణం ఉండాలని పేర్కొంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని కుటుంబ న్యాయస్థానం జూలై 2001లో తన భార్య మానసిక క్రూరత్వానికి గురిచేస్తోందని భర్త చేసిన వాదనను అంగీకరించిన తర్వాత వివాహాన్ని రద్దు చేసింది. మే 2009లో ఆ మహిళ కలకత్తా హైకోర్టులో ఆ ఉత్తర్వులను సవాలు చేసింది.
భర్తను "పిరికివాడు", "నిరుద్యోగి"గా అభివర్ణించే అంశంపై.. భార్య తప్పుడు ఫిర్యాదు కారణంగా భర్త తన ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాడని కోర్టు పేర్కొంది. పిటిషనర్ డైరీలోని కొన్ని విషయాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అక్కడ ఆమె తన భర్తను "పిరికివాడు", "నిరుద్యోగి" అని పదే పదే అభివర్ణించింది. తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నట్లు డైరీలో పలుమార్లు స్పష్టం చేసింది. కోర్టు పరిశీలన ప్రకారం.. పిటిషనర్ డైరీలో వేరే చోట పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు కూడా స్పష్టం చేసింది.
అలాంటి సందర్భాలలో వివాహం కేవలం చట్టపరమైన బంధంగా మిగిలిపోతుంది. అందువల్ల అది కల్పితం తప్ప మరొకటి కాదని కోర్టు పేర్కొంది. వాదనలు విన్న డివిజన్ బెంచ్ 2001లో వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.