హరిద్వార్ కుంభమేళా.. ఏ మాత్రం నిబంధనలు పాటించని భక్తులు..!
Huge crowd gathers for Kumbh Mela in Haridwar. హరిద్వార్‌లోని కుంభమేళాలో పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు కోవిడ్ నిబంధనలు అసలు పాటించడం లేదు.
By Medi Samrat
కరోనా మహమ్మారి భారతదేశంలో ఉగ్ర రూపం దాలుస్తూ ఉన్న సంగతి తెలిసిందే..! ముఖ్యంగా ప్రజల్లో అలసత్వం కారణంగా కరోనా మహమ్మారి పెరిగిపోతూ ఉంది. కరోనాను కట్టడి చేయడానికి మాస్కులను ధరించమని చెప్పినా కూడా చాలా మంది పట్టించుకోవడం మానేశారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని కుంభమేళాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సామాన్య భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అనుమతినిచ్చారు. పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు కోవిడ్ నిబంధనలు అసలు పాటించడం లేదు. కుంభమేళా ఐజీ సంజయ్ గుంజుయాల్ మాట్లాడుతూ అంచనాలకు మించి భక్తులు పుణ్యస్నానాలకు వస్తున్నారని.. కోవిడ్ నిబంధనలు పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఇక మాస్కు లేని వారి నుంచి చలాన్లు వసూలు చేయడం నిలిపివేశామని.. ఒక వేళ చలాన్లు వసూలు చేయడం ప్రారంభించి.. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తే తొక్కిసలాట జరిగే అవకాశం ఉందన్నారు. అంతమంది జనంలో కరోనా నిబంధనలు పాటించడం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరికివారు వ్యక్తిగతంగా కరోనా సోకకుండా జాగ్రత్త పడితేనే వైరస్‌ను అదుపు చేయగలమని అన్నారు.
కుంభమేళా గంగా హారతిని పురస్కరించుకొని గంగానదిలో సోమవారం, బుధవారం భక్తులు షాహీ స్నానాలు ఆచరించనున్నారు. ఈ మేరకు ఉత్తరఖండ్ ప్రభుత్వం గంగా జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్-19 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ ప్రజల్లో అవగాహన కనిపించడం లేదు. హరిద్వార్‌కు వచ్చే భక్తులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేస్తున్నారు. షాహీ స్నాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన 372 మంది భక్తులకు కరోనావైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.