భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది. వ్యాక్సిన్లు ఒక్కటే కరోనా మహమ్మారిని అంతం చేయగలవని.. వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అంటూ ఉన్నారు. అయితే కొన్ని రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాక్సిన్ వృధా అవుతోంది.
భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ల కోసం క్యూలలో నిలబడి ఉన్నారు ప్రజలు. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వ్యాక్సిన్ ను వృథా చేస్తున్నారు. ఇప్పటి వరకూ 44 లక్షల టీకా డోసులు వృథా అయ్యాయని కేంద్రం తెలిపింది. ఆర్‌టీఐ చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు స్పందిస్తూ ప్రభుత్వం టీకా వృథాకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. టీకా వృథా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు, హరియాణా, పంజాబ్, మణిపూర్, తెలంగాణా ఉన్నాయి.
తమిళనాడులో అత్యధికంగా 12.10 శాతం మేర టీకాలు వృథా అయ్యాయి. హరియాణాలో 9.74 శాతం, పంజాబ్‌లో 8.12 శాతం, మణిపూర్‌లో 7.8 శాతం, తెలంగాణాలో 7.55 శాతం మేర టీకాలు వృథా అయ్యాయి. ఏప్రిల్ 11 వరకూ రాష్ట్రాలు 10 కోట్ల టీకా డోసులు వినియోగించగా వాటిల్లో 44 లక్షల డోసులు వృథా అయ్యాయి. టీకా వృథా అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మిజోరమ్, గోవా, దమన్ దియూ, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. టీకా నిల్వలు నిండుకుంటున్నాయంటూ రాష్ట్రాలు చెబుతుంటే..టీకా పంపిణీలో వైఫల్యాలే ఈ పరిస్థితికి కారణమని కేంద్రం అంటోంది. టీకా పంపిణీ ప్రణాళికలో లోపాలే అసలు సమస్య అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పెద్ద రాష్ట్రాలకు నాలుగు రోజులకు సరిపడా టీకాలు పంపిస్తున్నామని.. చిన్న రాష్ట్రాలకు 7-8 రోజులకు సరిపడా టీకాలను పంపిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.