హాస్టల్‌లో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
Hostel Students Tested Corona Positive In Maharashtra. కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మహారాష్ట్రలో హాస్టల్‌లో 39 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
By Medi Samrat Published on 24 Feb 2021 10:15 AM ISTకరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మహారాష్ట్రలో మాత్రం మళ్లీ వేగంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోని లాతూర్‌లో 39 మంది విద్యార్థులు సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. హాస్టల్‌లో ఉంటున్న 360 మంది విద్యార్థులకు పరీక్షలు చేయగా, ఇందులో సుమారు 39 మంది విద్యార్థులు వైరస్ బారిన పడినట్లు లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి మహేష్ పాటిల్ తెలిపారు. అయితే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారంతా 9వ తరగతి, 10వ తరగతికి చెందిన విద్యార్థులేనని అన్నారు. హాస్టల్‌లో 60 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉన్నారు. కరోనా పరీక్షలు చేసిన వారిలో మరి కొందరి రిపోర్టు రావాల్సి ఉంది. హస్టల్‌లో మొదట ఓ విద్యార్థినికి పాజిటివ్ నిర్ధారణ కాగా, అనంతరం ఆమె రూమ్‌మెట్స్ 13 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. కరోనా సోకిన వారందరిని సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్‌లో ఐసోలేషన్‌కు తరలించినట్లు మహేష్ పాటిల్ తెలిపారు.
కాగా, గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 6218 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 51 మంది మృతి చెందారు. ఈ రోజురోజుకు మళ్లీ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తీవ్రతరం కావడంతో అధికారుల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడకి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఇంకా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. కేసుల సంఖ్య పెరిగిపోతే మరో రెండు వారాల్లో లాక్‌డౌన్ విధించక తప్పదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే స్పష్టం చేశారు. విదర్భ ప్రాంతంలో కోవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉండటంతో పర్భనీ ప్రాంతం వారు విదర్భలోకి వెళ్లకూడదంటూ పర్భనీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అర్థరాత్రి నుంచి ఫిబ్రవరి 28వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటాయని తెలిపారు.
ఇక ప్రైవేటు, ప్రజారవాణా వ్యవస్థకు కూడా వర్తిస్తుందని సూచించారు. ప్రజల రాకపోకలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరిహద్దు వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. అత్యవసర సమయాల్లో అయితే ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో వస్తేను అనుమతి ఇస్తున్నారు.