సెలవుల్లో ఉన్న బలగాలు వెంటనే విధుల్లో చేరాలి: అమిత్ షా
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
By Knakam Karthik
సెలవుల్లో ఉన్న బలగాలు వెంటనే విధుల్లో చేరాలి: అమిత్ షా
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై భారత భద్రతా బలగాలు దీటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారా మిలటరీ బలగాల సెలవులను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. తొమ్మిది పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత కూడా పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో పది మంది భారత పౌరులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల్లో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. సీఆర్పీఎఫ్ బీఎస్ఎఫ్, ఐటీబీపీ సహా అన్ని పారామిలిటరీ బలగాల అధిపతులకు అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఆదేశించారు. తక్షణమే అందరూ తమతమ విధులకు హాజరు కావాలని సూచించారు.
విహార యాత్రకు వెళ్లిన పర్యాటకులపై పహల్గాంలో గత నెలలో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది ప్రాణాలు తీశారు. అప్పట్నుంచే పాకిస్థాన్‌పై అన్నివైపులా భారత్ ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ఇప్పుడు ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడి చేయడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పారంటూ కేంద్ర ప్రభుత్వాన్ని, భద్రతా బలగాలను ప్రశంసిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్ పై X వేదికగా స్పందించిన అమిత్ షా.. ఉగ్రమూక సృష్టించిన హత్యాకాండకు సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలిస్తామని హెచ్చరించారు. మరోవైపు భారత్ మెరుపు దాడుల పట్ల యావత్ దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. పాక్ కు తగిన బుద్ధి చెప్పారంటూ సంబరాలు చేసుకుంటున్నారు.