మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులున్నాయి..? జాగ్రత్త..భారీ జరిమానా చెల్లించుకోవాల్సిందే..!
Holding more than one PAN card. (ఐటీ) శాఖ నిబంధనల ప్రకారం.. ఏ ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డు కలిగి ఉండరాదు.
By Medi Samrat Published on 7 March 2021 9:42 AM IST
ప్రస్తుతం బ్యాంకుల్లో లావాదేవీలు జరపాలంటే పాన్‌కార్డు తప్పనిసరిగా మారింది. ఇక పాన్‌కార్డు ఉపయోగించాలంటే ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉండాలి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు, ఐటీ రిటర్న్ దాఖలు చేయడానికి అత్యంత ముఖ్యమైనది పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్). పాన్ డిజిట్ నెంబర్‌ను ఆదాయ పన్ను శాఖ కేటాయిస్తుంది. ఆదాయం పన్ను చెల్లింపుదారుడు పాన్‌కార్డు కలిగి ఉండటం తప్పనిసరి అయ్యింది. దేశమంతా కొంత మంది ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటం బయటపడుతూనే ఉన్నాయి.
ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నిబంధనల ప్రకారం.. ఏ ఒక్కరూ ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డు కలిగి ఉండరాదు. అలా ఉన్నట్లయి వారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. పాత పాన్‌కార్డుపై క్రెడిట్ స్కోర్ బ్యాడ్‌గా ఉంటే రుణాలు తీసుకోవడం కోసం కొంత మంది ఉద్దేశ పూర్వకంగా ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డుల కోసం దరఖాస్తు చేస్తుంటారు.మరి కొందరేమో తమ ఆదాయాన్ని విభజించి పన్ను చెల్లింపుల భారాన్ని తగ్గించుకోవడానికి ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు తీసుకుంటారు. అలాగే మొదటి పాన్ కార్డు పోగొట్టుకుంటే దాని స్థానంలో డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకోకుండా కొత్త కార్డు తీసుకునేందుకు అప్లికేషన్ చేసుకుంటుంటారు.
ఇక అత్యధిక కేసుల్లో మహిళల వివాహమైన తర్వాత వాటి ఇంటిపేరు మారుతుంది. ఇటువంటి సందర్భాల్లోనూ ఒరిజినల్ కార్డును అప్‌డేట్ చేయడానికి బదులు కొత్త పాన్‌కార్డు కోసం మహిళలు దరఖాస్తు చేస్తుంటారు. అందుకే ఆదాయ పన్ను శాఖ 272బీ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు కలిగి ఉంటే రూ.10 వేల వరకు జరిమానా విధించాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ పాన్‌కార్డులు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది.
ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ పాన్‌కార్డులు తీసుకునేందుకు ప్రయత్నించినా.. ఆధార్ అనుసంధానం చేసే సమయంలో పక్కా దొరికిపోతారు. అందుకే ఒకటికంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉండటంపై ఇప్పుడు ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు చేపడుతోంది. అందుకే ఎవరి దగ్గరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్నట్లయితే దానిని వెంటనే రద్దు చేసుకోవాలని సూచిస్తోంది ఆదాయ పన్ను శాఖ. లేకపోతే అనవసరంగా చిక్కుల్లో పడి భారీ పెనాల్టీ చెల్లించుకోక తప్పదు.