రైతుల ఆందోళన.. హైవేల మూసివేత.!
Highways Blocked Due to Farmer Protest. అప్రమత్తమైన దిల్లీ పోలీసులు, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చే జాతీయ రహదారులను మూసివేశారు.
By Medi Samrat
కిసాన్ ఆందోళన్‌లో భాగంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిన్నటి నుంచే పంజాబ్ నుంచి భారీ సంఖ్యలో వచ్చిన మహిళలు దిల్లీ-హరియాణా సరిహద్దులోని టిక్రీ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ఉదయానికే అక్కడ వేల సంఖ్యలో మహిళా రైతులు, వారి కుటుంబ సభ్యులు నిరసనల్లో పాల్గొన్నారు. ఫలితంగా తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారి 9తో పాటు ఎన్‌హెచ్-24 పై ఇరువైపుల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందుజాగ్రత్తగా ఉత్తర్‌ప్రదేశ్ గేట్ వద్ద జాతీయ రహదారులను అధికారులు పూర్తిగా మూసివేశారు.
దిల్లీ నుంచి ఘజియాబాద్ వెళ్లే వాహనాలను మాత్రం దారిమళ్లిస్తున్నారు. రైతుల ఆందోళనలతో అటు దిల్లీ మెట్రో సంస్థ కూడా అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా టిక్రీ కలాన్ నుంచి బ్రిగేడియర్ హోషియార్ సింగ్ మార్గంలోని మెట్రోస్టేషన్లను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. మహిళలు చేపట్టిన ఆందోళన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది.