బీహార్ అసెంబ్లీ లో హైడ్రామా

High Drama In Bihar Assembly. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు గందరగోళం సృష్టించాయి. కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ

By Medi Samrat
Published on : 24 March 2021 7:37 AM IST

High Drama In Bihar Assembly

బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీలు గందరగోళం సృష్టించాయి. కొత్త పోలీస్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు పోలీసు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికార పక్షం వెనక్కి తగ్గకుండా ప్రవేశపెట్టింది. దీంతో సభలో రభస ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయంలో స్పీకర్ ని విపక్ష సభ్యులు నిర్బంధించారు. దీంతో విపక్ష సభ్యులను మార్షల్స్ బయటకు లాక్కొచ్చారు. ఈ క్రమంలో ఆర్జెడి ఎమ్మెల్యే సతీష్ కుమార్ దాస్ మూర్ఛపోయారు. గందరగోళం మధ్య మంగళవారం నాడు అసెంబ్లీ కార్యకలాపాలు 4 సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.సభకు అంతరాయం కలిగిస్తున్న ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మార్షల్స్‌ వారిని అసెంబ్లీ భవనం బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. విపక్షానికి చెందిన మహిళా ఎమ్మెల్యేలు స్పీకర్‌ విజయ్ కుమార్ సిన్హా చాంబర్‌ ముందు బైఠాయించారు. ఆయణ్ని తన చాంబర్ నుంచి బయటకు రాకుండా చేశారు. దీంతో మహిళా పోలీసులు వచ్చి వారిని భవనం బయటకు లాగేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇంధన ధరలకు నిరసనగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం బీహార్ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు.దీనిలో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌లు అసెంబ్లీ వైపు భారీ ర్యాలీ నిర్వహించారు. అప్రమత్తమైన పోలీసులు ఆర్జేడీ నేతలు, కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేశారు. పలువురిని అరెస్ట్ చేశారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆందోళన కారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు.

ఇంతకీ పోలీస్ బిల్లులో ఏముంది?

పోలీసులకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ నితీశ్ కుమార్ ప్రభుత్వం 'బిహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021'ను రూపకల్పన చేసింది. ఈ చట్టం పోలీసులకు వారెంట్ లేకుండానే విచారణ చేయడానికి అవకాశం కల్పిస్తుందని ఆర్జేడీ నేతలు చెబుతున్నారు. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయస్థానాలకు, మేజిస్ట్రేట్‌లకు సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయం లేకుండా పోలీసులు ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం ఈ చట్టం ద్వారా దోహదపడుతోందని చెబుతున్నారు. ముందు నుంచి ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని ఆర్జేడీ నేతలు విమర్శించారు. నితీశ్ ప్రభుత్వం రౌడీయిజానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.




Next Story