సోనూకు షాక్ ఇచ్చిన హైకోర్టు

High Court Rejects Actor Sonu Sood's Plea Against Illegal Construction Notice.అన‌ధికారికంగా భ‌వనాలు నిర్మించార‌నే ఆరోపణలతో బీఎంసీ ఇచ్చిన నోటీసులపై సోనూసూద్‌ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టి వేసింది.

By Medi Samrat  Published on  21 Jan 2021 10:33 AM GMT
Sonu Sood case updates

నటుడు సోనూ సూద్ కు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కు మధ్య ఇటీవలి కాలంలో కట్టడాల విషయమై వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. తమ నోటీసులను పట్టించుకోవడం లేదంటూ బీఎంసీ సోనూ సూద్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అన‌ధికారికంగా భ‌వనాలు నిర్మించార‌నే ఆరోపణలతో బీఎంసీ ఇచ్చిన నోటీసులపై సోనూసూద్‌ వేసిన పిటిషన్‌ను బాంబే కోర్టు కొట్టి వేసింది.

మీకున్న అవకాశాన్ని కోల్పోయారు.. మీరు చాలా ఆలస్యమయ్యారు.. నిజాయతీ గల వారి వైపు న్యాయం ఉంటుంది. ఇప్పుడు బంతి బీఎంసీ చేతిలోకి వెళ్లింది. వారిని సంప్రదించండని జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ చెప్పారు.

ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్‌కు శక్తి సాగర్‌ అనే పేరుతో ఆరంతస్తుల భవనం ఉంది. గ‌తేడాది అక్టోబ‌ర్‌ 20న సోనూసూద్‌కి బీఎంసీ నోటీసులు అందించ‌గా.. వాటిని స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించారు. డిసెంబ‌ర్‌లో దిగువ కోర్టు కొట్టివేయ‌డంతో సోనూ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇప్పుడు హైకోర్టు గురువారం విచారించి అన్ని వివరాలు పరిశీలించి సోనూసూద్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

నివాస సముదాయాన్ని హోటల్‌గా మార్చి చట్టవిరుద్ధ పద్ధతిలో కమర్షియల్‌ లాభాలు పొందాలని భావిస్తున్నారని బీఎంసీ తెలిపింది. ఇప్పటికే కొంతమేర నిర్మాణాలు కూల్చివేసినప్పటికీ, లైసెన్స్‌ డిపార్టుమెంట్‌ అనుమతులు తీసుకోకుండానే మళ్లీ పునర్నిర్మాణం మొదలుపెట్టారని అయితే ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తన దగ్గర అన్ని అనుమతులు ఉన్నాయని స్పష్టం చేస్తూనే కేవలం ఎం‌సీజెడ్‌ఎం‌ఏ (మహారాష్ట్ర కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ) నుంచి మాత్రమే అనుమతులు రావాల్సి ఉందని తెలిపారు.


Next Story