మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్ని ఏళ్ల పాటు కొనసాగుతుందంటే?

మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందగా, దీనికి అనుకూలంగా 454 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓటు వేశారు.

By అంజి  Published on  21 Sept 2023 6:42 AM IST
Womens Reservation Bill, National news, Lok Sabha

మహిళా రిజర్వేషన్ బిల్లు ఎన్ని ఏళ్ల పాటు కొనసాగుతుందంటే?

మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందగా, దీనికి అనుకూలంగా 454 మంది సభ్యులు, వ్యతిరేకంగా ఇద్దరు సభ్యులు ఓటు వేశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాలని బిల్లు కోరింది. నారీ శక్తి వందన్ బిల్లును మంగళవారం ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఇది కొత్త పార్లమెంటు భవనంలో ప్రవేశపెట్టిన మొదటి బిల్లుగా నిలిచింది. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం విధాన రూపకల్పనలో మహిళలు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లు 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. బుధవారం లోక్‌సభలో బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం స్లిప్పుల ద్వారా సభలో ఓటింగ్ నిర్వహించారు. అంతకుముందు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాలు లోక్ సభ నుంచి వాకౌట్ చేశాయి.

ఆ తర్వాత స్లిప్పుల ద్వారా ఓటింగ్ ప్రారంభం అయింది. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య ఉండడంతో ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పుల ద్వారా ఓటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ బిల్లుకు మద్దతు పలికారు, అయితే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, వెంటనే కోటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు ప్రకారం, డిలిమిటేషన్ కసరత్తు చేపట్టిన తర్వాత రిజర్వేషన్ అమలులోకి వస్తుంది. 15 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. మహిళల కోటాను అమలు చేయడానికి ముందు జనాభా లెక్కలు మరియు డీలిమిటేషన్ అవసరమని పలువురు ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు, ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆయన పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ బుధవారం లోక్‌సభలో బిల్లును వ్యతిరేకించారు.

కాగా ప్రస్తుతం, లోక్‌సభలో 82 మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం సంఖ్యలో దాదాపు 15 శాతం. 19 రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10 శాతం కంటే తక్కువే ఉంది. ప్రతీ డీలిమిటేషన్ ప్రక్రియ తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను రొటేట్ చేస్తామని బిల్లులో పేర్కొన్నారు. ఈ వివరాలను పార్లమెంట్ తర్వాత నిర్ణయిస్తుంది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వానికి ఈ రాజ్యాంగ సవరణ అధికారాన్ని కల్పిస్తుంది. ఇదిలా ఉంటే.. డీలిమిటేషన్ జరిగిన తర్వాత లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అయ్యాక మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావొచ్చు. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)ల కోసం రిజర్వ్ చేసిన సీట్లు ఉన్నాయి. ఆ రిజర్వ్‌ చేసిన స్థానాల్లో ఇప్పుడు మూడోవంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు.

Next Story