ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు ముగిసాయి. గాంధీనగర్‌లోని శ్మశానవాటిలో మాతృమూర్తి చితికి మోదీ నిప్పంటించారు. అంతకముందు గాంధీనగర్‌లోని ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభమైంది. మాతృమూర్తి పాడెను మోదీ మోశారు. అంతిమ యాత్ర వాహనంలోనూ తల్లి పార్థివదేహం వద్దే కూర్చున్నారు. అంతిమ యాత్రలో మోదీ కుటుంబ సభ్యులతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
హీరాబెన్ అనారోగ్యంతో శుక్రవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పోస్టులు పెట్టారు. సంతాపం తెలిపిన వారిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు ఉన్నారు.