ఉగ్రరూపం దాల్చిన యమునా నది.. ఢిల్లీలో అలెర్ట్‌

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతోంది.

By Srikanth Gundamalla
Published on : 11 July 2023 10:56 AM IST

Heavy Rains, Yamuna River, Delhi,

ఉగ్రరూపం దాల్చిన యమునా నది.. ఢిల్లీలో అలెర్ట్‌

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతోంది. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వరదలతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఢిల్లీలో అయితే యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. వరద భయంతో ఢిల్లీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తరాది రాష్ట్రాల్లో జలప్రళయం కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని డ్యాములు నిండాయి. దీంతో.. ఎగువ రాష్ట్రాల్లోని అధికారులు నీటిని వదలడంతో వరద ప్రవాహం ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఎగువ రాష్ట్రాలు నీటి విడుదల చేయడంతో ఢిల్లీలో యుమనానది ప్రమాదస్థాయిని దాటి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రస్తుతం యమునానది 205.33 మీటర్లు దాటి ప్రవాహిస్తోందని అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం నాటికి ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 206.28 మీటర్లుగా ఉంది. ఇక యుమునా నది వరద ప్రవాహం ఉధృతి సాయంత్రానికి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రజలను ఢిల్లీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.

యమునా నది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి ఇప్పటికే నీరు చేరిపోయింది. వరద ముప్పుని గ్రహించిన ఢిల్లీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యమునా నది వరద ప్రభావం ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందే అలర్ట్‌ చేసింది. సోమవారం నుంచే వారిని ఖాళీచేయించే పనులు ప్రారంభించింది. వరద ముంపు ప్రాంతాల్లోని ప్రజలను దాదాపుగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఢిల్లీలో యమునా నది అత్యధిక వరద ముప్పు స్థాయి 207.49 మీటర్లు. ప్రస్తుతం ఆ మార్క్‌ చేరే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. వర్షం తగ్గితే వరద కూడా తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు.

భారీ వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. యమునా నది ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జిపై రైల్వే, వాహన రాకపోకలను నిలిపివేశారు అధికారులు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రెండు శతాబ్ది, ఒక వందేభారత్‌ రైలు సహా మరికొన్ని రైళ్లు వరద కారణంగా రద్దు అయ్యాయి. మరో 14 రైళ్లను దారి మళ్లించినట్లు ఇండియన్ రైల్వే అధికారులు తెలిపారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ వరద ప్రభావం ఎక్కువగానే ఉంది. భారీ వర్షాలకు బియాస్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో.. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరద ధాటికి వంతెనలతో పాటు.. రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వరద ప్రభావం, వర్షాలు ఎక్కవగా ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అతిభారీ వర్షాలు హిమాచల్‌లో ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉంది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే చాన్స్‌ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లో మాత్రం మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, దక్షిణ రాజస్థాన్‌లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Next Story