రాత్రి నుంచి జోరువాన.. నీటమునిగిన చెన్నై.. రెడ్ అలర్ట్
Heavy rain lashes Chennai City.ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది.
By తోట వంశీ కుమార్ Published on 11 Nov 2021 1:02 PM ISTఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది చెన్నైకి 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. నేటి(గురువారం) సాయంత్రానికి మహాబలిపురం, చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. కాగా.. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చెన్నై నగరం జలమయం కాగా.. జన జీవనం స్థంబించింది. వీధులన్నీ నదులను తలపిస్తున్నాయి.
చెన్నపట్నంలో గత 17 గంటలుగా వానపడుతోంది. చెన్నైతో పాటు శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. అత్యధికంగా చోళవరంలో 22 సెంటీమీటర్ల, గుమ్మడిపూండిలో 18 సెంటీమీటర్లు, ఎన్నూర్‌లో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఏ క్షణమైనా వాటి గేట్లను ఎత్తివేసే అవకాశం ఉండడంతో.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెన్నై తిరువళ్లూర్, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Tamil Nadu | Incessant rain causes water-logging at several parts of Chennai pic.twitter.com/Wu3wruFKbG
— ANI (@ANI) November 11, 2021
ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, మరో రెండు రోజుల పాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులని జారీ చేసింది. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్ బేలను మూసివేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.