ముంబైని ముంచెత్తిన భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

Heavy rain in Mumbai IMD forecasts more showers in next 24 hrs.దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రాన్ని భారీ వ‌ర్షాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2022 6:48 AM GMT
ముంబైని ముంచెత్తిన భారీ వ‌ర్షాలు.. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రాన్ని భారీ వ‌ర్షాలు అత‌లాకుత‌లం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి కురిసిన వ‌ర్షానికి అనేక ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాలు మునగ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. సియోన్, పరేల్, బాంద్రా, కుర్లా, ఘట్‌కోపర్, చెంబూర్, శాంతాక్రూజ్, అంధేరి, మలాడ్ మరియు దహిసర్‌తో సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ప‌లు చోట్ల రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. కొన్నిచోట్ల రైళ్లు ఆల‌స్యంగా న‌డుస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల వ‌ర‌కు ముంబై న‌గ‌రంలో 95.81 మిల్లీ మీట‌ర్ల, శివారు ప్రాంతాల్లో 110 మిల్లీమీట‌ర్లకు పైగా వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

ఇదిలా ఉంటే.. రానున్న 24 గంట‌ల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలను నగరంలో మోహరించారు.

మ‌హారాష్ట్ర సీఎంగా కొత్తగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే ముంబైతో పాటు పొరుగు జిల్లాల్లోని అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు. 'రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మ‌నుకుమార్ శ్రీవాస్త‌వ‌తో సీఎం చ‌ర్చ‌లు జ‌రిపారు. అన్ని సంబంధిత జిల్లాల సంర‌క్ష‌క కార్య‌ద‌ర్శులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప‌రిస్థితిని నియంత్రించాల‌ని ఆదేశించారు' అని సీఎంఓ కార్యాయంలో ట్వీట్ చేసింది.

Next Story