రూ.1.17 కోట్ల ఫ్యాన్సీ నెంబర్‌లో ట్విస్ట్..డబ్బు చెల్లించని బిడ్డర్, ఆస్తులపై విచారణకు ఆదేశం

హర్యానాలో ఓ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను రికార్డు స్థాయిలో రూ.1.17 కోట్లకు వేలంలో గెలుచుకుని, ఆ తర్వాత డబ్బు చెల్లించడంలో విఫలమైన వ్యక్తిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

By -  Knakam Karthik
Published on : 4 Dec 2025 10:56 AM IST

National News, Haryana, 1.17 crore fancy number, Fancy Number Plate, Transport Department Haryana

రూ.1.17 కోట్ల ఫ్యాన్సీ నెంబర్‌లో ట్విస్ట్..డబ్బు చెల్లించని బిడ్డర్, ఆస్తులపై విచారణకు ఆదేశం

హర్యానాలో ఓ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌ను రికార్డు స్థాయిలో రూ.1.17 కోట్లకు వేలంలో గెలుచుకుని, ఆ తర్వాత డబ్బు చెల్లించడంలో విఫలమైన వ్యక్తిపై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బిడ్డర్ ఆస్తులు, ఆదాయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని రవాణా శాఖను ఆదేశించినట్లు మంత్రి అనిల్ విజ్ తెలిపారు.

వివరాల్లోకి వెళితే... నవంబర్ 26న 'HR88B8888' అనే నంబర్ ప్లేట్‌కు ఆన్‌లైన్‌లో వేలం జరిగింది. రూ.50,000 కనీస ధరతో ప్రారంభమైన ఈ వేలంలో రోములస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన సుధీర్ కుమార్ అత్యధికంగా రూ.1.17 కోట్లకు బిడ్ దాఖలు చేసి దక్కించుకున్నారు. అయితే, ఈ నెల‌ 1వ తేదీతో డబ్బు చెల్లించేందుకు గడువు ముగిసినా ఆయన స్పందించలేదు. కేవలం రూ.11,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను వదులుకున్నారు.

ఈ వ్యవహారంపై హర్యానా రవాణా శాఖ మంత్రి అనిల్ విజ్ తీవ్రంగా స్పందించారు. "వేలంలో పాల్గొనడం ఓ హాబీ కాదు, అదొక బాధ్యత. ఆర్థిక స్థోమత లేకుండా వేలంలో ధరలను పెంచే వారిని నిరోధించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నాం. సుధీర్ కుమార్ ఆస్తులపై విచారణ జరిపి, అవసరమైతే ఆదాయపు పన్ను శాఖకు కూడా లేఖ రాస్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు సుధీర్ కుమార్ స్పందిస్తూ.. సాంకేతిక సమస్యల వల్ల డబ్బు జమ చేయలేకపోయానని తెలిపారు. ఒక నంబర్ ప్లేట్ కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి తన కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని, వారితో చర్చిస్తున్నట్లు చెప్పారు. అధికారులు మాత్రం ఈ నంబర్ ప్లేట్‌ను మళ్లీ వేలానికి ఉంచనున్నట్లు ప్రకటించారు.

HR88B8888 ఎందుకు ప్రత్యేకమైనది?

HR88B8888 అనేది బిడ్డింగ్ ద్వారా ప్రీమియంతో కొనుగోలు చేయబడిన ఒక ప్రత్యేకమైన వాహన నంబర్ లేదా VIP నంబర్. HR అనేది రాష్ట్ర కోడ్, ఇది వాహనం హర్యానాలో రిజిస్టర్ అయిందని సూచిస్తుంది. 88 వాహనం నమోదు చేయబడిన హర్యానాలోని నిర్దిష్ట ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) లేదా జిల్లాను సూచిస్తుంది. నిర్దిష్ట RTO లోపల వాహన శ్రేణి కోడ్‌ను సూచించడానికి B ఉపయోగించబడుతుంది. 8888 అనేది వాహనానికి కేటాయించబడిన ప్రత్యేకమైన, నాలుగు అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. ఈ నంబర్ ప్లేట్ ప్రత్యేకత ఏమిటంటే, 'B' ని పెద్ద అక్షరంలో పరిగణనలోకి తీసుకుంటే ఎనిమిది సంఖ్యల స్ట్రింగ్ లాగా కనిపిస్తుంది మరియు ఒకే అంకె పునరావృతమవుతుంది.

Next Story