చండీగఢ్: మన దేశంలో ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేరు. కొందరు తమ అదృష్ట సంఖ్యల కోసం, మరికొందరు తమ వాహనం ప్రత్యేకంగా కనిపించడం కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ, హర్యానాలో జరిగిన ఓ వేలంపాటలో ఒక ఫ్యాన్సీ నంబర్ ఏకంగా కోటి రూపాయలకు పైగా ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. హెచ్ ఆర్ 88 బీ 8888' అనే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఒక వ్యక్తి రూ. 1.17 కోట్లకు దక్కించుకున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్‌గా రికార్డు సృష్టించింది.
హరియాణా రవాణా శాఖ ప్రతి వారం వీఐపీ సంబర్ల కోసం వేలం నిర్వహిస్తుంది. ఈ వారం వేలంలో ఈ సంబర్ పై అందరి దృష్టి పడింది. ఈ ఒక్క నంబర్ కోసం ఏకంగా 45 మంది పోటీ పడ్డారు. రూ.50,000 వేల కనీస ధరతో ప్రారంభమైన వేలం బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగిసేసరికి రూ. 1.17 కోట్ల వద్ద స్థిరపడింది. ఇంత ధర పలకడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. ఇందులో బీ అక్షరం చూడటానికి 8 అంకెలా కనిపిస్తుంది. దీంతో నంబర్ ప్లేట్‌పై అన్ని 8 అంకెలే ఉన్నట్లుగా స్పెషల్ అట్రాక్షన్ వస్తుంది.