ఐపీఎస్ పూరన్ సూసైడ్ కేసులో సంచలనం..డీజీపీని తొలగించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో హర్యానా డీజీపీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది
By - Knakam Karthik |
ఐపీఎస్ పూరన్ సూసైడ్ కేసులో సంచలనం..డీజీపీని తొలగించిన ప్రభుత్వం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐపీఎస్ పూరన్ ఆత్మహత్య కేసులో హర్యానా డీజీపీపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. రెండు నెలలగా సెలవులో ఉన్న డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను పదవి నుంచి తొలగిస్తూ హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తి స్థాయి డీజీపీ నియమించే వరకు ఐపీఎస్ ఓపీ సింగ్‌కు హరియాణా డీజీపీగా అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓపీ సింగ్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొత్త డీజీపీ ఎంపిక కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పలువురు సీనియర్ అధికారుల పేర్లను పంపనుంది ప్రభుత్వం.
అంతకుముందు హరియాణా డీజీపీని ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఒకవైపు విపక్ష నేతలు, మరోవైపు హరియాణా, చండీగఢ్‌లోని వాల్మీకి సమాజానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు సత్వర చర్యల కోసం డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ఉద్యోగాలకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కపూర్ ప్రస్తుతం పంచకులలోని హరియాణా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన కపూర్‌ను ఆగస్టు 2023లో రాష్ట్ర పోలీసు అధిపతిగా నియమించింది ప్రభుత్వం.
అసలేం జరిగిందంటే?
2001 ఐపీఎస్ బ్యాచ్ హరియాణా క్యాడర్‌కు చెందిన 52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఆయన అధికారుల హక్కుల గురించి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయనను పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఐజీగా బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే చండీగడ్‌లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆయన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది మంది అధికారుల పేర్లను కూడా ప్రస్తావించారు. పూరన్ మృతికి కారణమైనవారిపై చర్యలు తీసుకుంటేనే శవపరీక్షకు అంగీకరిస్తామని, ఆయన కుటుంబ సభ్యులు పోస్టుమార్టంనకు అంగీకారం తెలపలేదు. దాదాపు 10 రోజుల తర్వాత శవపరీక్ష నిర్వహించారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆయన భార్య అమ్నీత్ పి కుమార్ కూడా ఐఏఎస్ అధికారిణి. ఆత్మహత్య సమయంలో సీఎంతో కలిసి అధికార పర్యటనలో భాగంగా జపాన్ పర్యటనలో ఉన్నారు.