కరోనా కట్టడికి హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను మే 31 ఉదయం 5 గంటల వరకు పొడిగించింది. సురక్షిత్ హర్యానా లాక్డౌన్ కింద ఆంక్షలు మే 24 వరకు అమలు చేయాలని తొలుత రాష్ట్ర ప్రభుత్త్వం నిర్ణయించింది. అయితే ఈ సారి వాటిలో కొన్ని సడలింపులను ఇస్తూ మే 31 వరకూ కొనసాగించింది. సరి బేసి లెక్కన మధ్యాహ్నం 12 వరకూ దుకాణాలను తెరవడానికి అనుమతించింది. రాత్రి కర్ఫ్యూ లేదని పేర్కొంది.
మరోవైపు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని హస్తినా సరిహద్దుల్లో ఉద్యమం చేపట్టి ఈ నెల 26కు ఆరు నెలలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో 40 రైతు సంఘాలు 26 న బ్లాక్ డేకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హరియాణలోని పలు జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు ఢిల్లీ కి బయలు దేరారు. భారత్ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ నేతృత్వంలో వందలాది వాహనాల్లు ఈరోజు రోడ్డెక్కాయి.
బ్లాక్ డే నిరసనలో భాగంగా వారంపాటు దిల్లీ సరిహద్దుల్లో రైతులు సామూహిక భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ఉద్యమం కారణంగా కోవిడ్ విజృంభిస్తుందని హర్యానా ప్రభుత్వం చేస్తున్న వాదనను రైతు నేతలు తిప్పికొట్టారు. తాము కరోనా వైరస్ వ్యాప్తికి కారణం కాదని, ఆ చలవంతా ప్రభుత్వానిదేనని కౌంటరిచ్చారు. ఇదే సమయంలో హర్యానా ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగిస్తున్నట్టు ఆ ప్రకటించింది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ను పొడిగించటం ఇది నాల్గవసారి. హర్యానా లో లాక్డౌన్ మొదట మే 3 న ప్రకటించబడింది.